నిప్పులు చెరిగిన ఆర్కే రోజా
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అప్పుల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ప్రజలు ఏడు నెలలకే కూటమి పాలనపై అసంతృప్తికి గురయ్యారని అన్నారు. అడ్డగోలు హామీలతో మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో తట్టుకోలేక రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
మంగళవారం ఆర్కే రోజా సెల్వమణి ఎక్స్ వేదికగా స్పందించారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడును మించిన నాయకుడు లేడన్నారు. దావోస్ కు తండ్రీ కొడుకులు వెళ్లి ఏం తీసుకు వచ్చారో చెప్పాలన్నారు. ప్రజలకు సంబంధించిన డబ్బులతో ఎంజాయ్ చేశారని, ఒక్క పైసా కూడా ఏపీకి రాలేదన్నారు మాజీ మంత్రి.
ఎలాంటి తప్పులు చేయక పోయినా కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని , అయినా బెదిరే ప్రసక్తి లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.