పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. జగన్ ఎంత ధైర్యవంతుడో రాష్ట్రంలో చిన్ని పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, తను మొండిఘటం ఆ విషయం పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. జగన్ భయపడే రకం కాదని, ఇంకా కావాలంటే సోనియా గాంధీ, చంద్రబాబులను అడిగితే తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష హోదాపై తలా తోకా లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
సోమవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబు పాలనను చూసి ఛీదరించు కుంటున్నారని అన్నారు. నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కూటమి సర్కార్ కే దక్కుతుందన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
జగన్ ప్రజలు మెచ్చిన నాయకుడని అన్నారు. త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. జనం గుండెల్లో నిక్షిప్తమై ఉన్న తనను తుడిచి వేయాలని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు. పాలన చేతకాక తమ నాయకుడిపై నోరు పారేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.