మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం దారుణం
మాజీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. గత ప్రభుత్వం పేదలకు, విద్యార్థులకు మెరుగైన రీతిలో వైద్య విద్య అందించేందుకు ప్రయత్నం చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో శ్రమతో కొత్తగా మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చారని తెలిపారు.
రాష్ట్రంలో కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆర్కే రోజా సెల్వమణి. తమ ప్రభుత్వం తసీఉకు వచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సర్కార్ నిర్ణయించడం దారుణమన్నారు.
ఇందులో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ ఎన్ఎంసీకి లేఖ రాయడం దుర్మార్గమని పేర్కొన్నారు ఆర్కే రోజా సెల్వమణి. ఇది మంచి పద్దతి కాదని అన్నారు.
చంద్రబాబు నాయుడు తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏపీకి తీసుకు రాలేక పోయారని ఎద్దేవా చేశారు. జగనన్న గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం క్షమించరాని నేరమని మండిపడ్డారు ఆర్కే రోజా సెల్వమణి. ఈ నిర్ణయం కారణంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని వాపోయారు.