రాయల్స్ వెనుక రియల్ హీరో
మెంటార్..కోచ్..మార్గదర్శి కుమార
రాజస్థాన్ – అందరినీ సంభ్రమాశ్చర్యాల్లోకి నెట్టేస్తూ దిగ్గజ జట్లను మట్టి కరిపిస్తూ తనకంటూ ఎదురే లేని రీతిలో విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్. గత సీజన్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది. కొన్ని తప్పిదాలు చేసింది. కానీ ఈసారి జరుగుతున్న 17వ సీజన్ ఐపీఎల్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పూర్తిగా రాజస్థార్ రాయల్స్ ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.
ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో రాణిస్తూ ఔరా అనిపించేలా ఆడుతోంది. ముందు బ్యాటింగ్ కు దిగితే భారీ పరుగులు చేస్తోంది. ఇక ప్రత్యర్థి జట్టు ఒకవేళ భారీ లక్ష్యాన్ని ముందుంచినా తొట్రు పడకుండా ఛేదిస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ హాట్ ఫెవరేట్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ ను పేర్కొంటున్నారు.
ఇక జట్టు వరుస గెలుపులతో రికార్డుల మోత మోగిస్తుంటే ..సంజూ శాంసన్ కెప్టెన్సీ పరంగానే కాదు ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఆరేంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇక జట్టును తీర్చి దిద్దడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు శ్రీలంకకు చెందిన మాజీ స్టార్ క్రికెటర్, కెప్టెన్ కుమార సంగక్కర. ఆ జట్టు వెనుక రియల్ రాయల్ హీరో అతడేనంటున్నాడు సంజూ శాంసన్.