సూర్యవంశీ సెంచరీ
రాజస్థాన్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కేవలం 14 ఏళ్ల వయసు కలిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్థాన్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. మైదానం చుట్టూ కళ్లు చెదిరే షాట్స్ తో హోరెత్తించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 206 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా రాజస్థాన్ ఛేధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 35 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 7 ఫోర్లు 11 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. 101 రన్స్ కు పెవిలియన్ బాట పట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
తను ఆడిన 38 బంతులలో కేవలం ఫోర్లు, సిక్సర్లతో 94 పరుగులు వచ్చాయంటే ఎంత దూకుడుగా ఆడాడో తెలుస్తుంది. మైదానంలోకి వచ్చీ రావడంతోనే ఎలాంటి బెంగ లేకుండా దాడి చేయడం ప్రారంభించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ , ప్రసిద్ద్ కృష్ణ..ఇలా గుజరాత్ బౌలర్లకు కంటి మీద కునుకే లేకుండా చేశాడు ఈ బుడ్డోడు. తను అవుట్ అయ్యాక పెవిలియన్ కు వస్తున్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీం మొత్తం లేచి నిలబడింది. తనను అభినందలతో ముంచెత్తింది.