ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – ఎలాంటి షరతులు లేకుండానే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వీటిని అందిస్తామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు మల్లు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో , పదేళ్ల కాలంలో అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపించారు.
కానీ తాము వచ్చాక ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ లభించిందని, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట తప్పలేదన్నారు. ఏకంగా 50 వేలకు పైగా జాబ్స్ ను భర్తీ చేశామని చెప్పారు. గత సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు డిప్యూటీ సీఎం.