పోలీసుల ఆందోళనపై ఆలోచించండి – ఆర్ఎస్పీ
సీఎం రేవంత్ రెడ్డి..డీజీపీకి సూచన
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన స్పందించారు . సోమవారం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా, భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొలువు తీరాక ఇప్పటి వరకు విద్యా శాఖకు కానీ హొం శాఖకు కానీ మంత్రులు లేక పోవడం దారుణమన్నారు. కీలక శాఖలన్నీ సీఎం వద్ద ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. రేయింబవళ్లు విధులు నిర్వహించే పోలీసుల పట్ల అనుసరిస్తున్న ధోరణి మంచిది కాదని సూచించారు. వారి వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
పాలనా వైఫల్యం కారణంగానే టీజీఎస్పీలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆయన ఆరోపించారు. యూనిఫాం ధరించిన స్పెషల్ పోలీసులు తామే ఉద్యమకారులై ధర్నాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్వవస్థ లో ఎన్నడూ అభిలషణీయం కాదన్నారు. కానీ వాళ్లకు ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక సారి ఆలోచించాలని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. అసలు పని చెయ్యాల్సిన సీఎం అటెన్షన్ డైవర్షన్ లాంటి పనులను ప్రోత్సహించడం మంచిది కాదని పేర్కొన్నారు . పోలీస్ సోదరులు కూడా సంయమనం పాటించాలని కోరారు ఆర్ఎస్పీ.