ఇచ్చిన మాట తప్పాడని ఆరోపణ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
సెక్షన్ 316 BNS ప్రకారం నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. డిసెంబర్ 6, 2023న తాను చేసిన ప్రమాణ స్వీకారాన్ని సీఎం ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలిస్తానని హామీ ఇచ్చారని, కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఫార్ములా ఇ ఒప్పందం రద్దు చేయడం వల్ల రాష్ట్రం రూ. 53 కోట్లను కోల్పోయిందన్నారు. వేలాది జాబ్స్ కల్పించే ఇ మొబిలిటీ వ్యాలీని కోల్పోయిందన్నారు.
ఒకవేళ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పి ఉంటే దేశానికి ఒక వనరుగా ఉండేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 14 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు కనిపించే తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ సంక్రాంతి రోజున నిర్వహించిన కైట్ ఫెస్టివల్, హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా – ఇ రేస్ మధ్య తేడా ఏమిటి అని ప్రశ్నించారు.
రెండూ రాజధాని , రాష్ట్రం ఇమేజ్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు కావా అని ప్రశ్నించారు. ఒకటి సరైనది మరొకటి తప్పు ఎలా అవుతుందంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డిని.
ముఖ్యమంత్రి ఒప్పందాన్ని రద్దు చేయడానికి దారితీసిన కారణాల వల్ల పన్ను డబ్బు నిరుపయోగంగా మారిన విషయంపై కేసు నమోదు చేసి, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలతో దర్యాప్తు చేయమని తాను నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని కోరానని తెలిపారు.