గువ్వల ప్రాణాలకు ముప్పు – ఆర్ఎస్పీ
ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు తమ పార్టీకి చెందిన వారిపై దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం మంచి పద్దతి కాదన్నారు. దాడులకు దిగిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారం ఉంది కదా అని ఎలా పడితే , ఎవరిని పడితే వారిపై దాడులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. బాల రాజుపై, భార్యపై, కుటుంబీకులపై మూకుమ్మడి దౌర్జన్యాలకు పాల్పడితే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ సంస్కృతికి తెర తీసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఎందుకు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అనుచరులపై దాడులకు దిగడం అంటే గువ్వలకు ప్రాణానికి కూడా ముప్పు ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయనకు భద్రత కల్పించాలని కోరారు. తాము ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.