కవిత అరెస్ట్ బూటకం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా అక్రమమని పేర్కొన్నారు.
కవిత అమాయకురాలని , ఆమెను కావాలని ఇరికించేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్పీ. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూడటం దారుణమని వాపోయారు.
కవిత అరెస్ట్ ను తమ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఇదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం తప్ప మరొకటి కాదన్నారు బీఎస్పీ చీఫ్. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికమని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
ఇలాంటి అక్రమ అరెస్ట్ ల తో అదిరేది బెదిరేది లేదని హెచ్చరించారు. కవిత అరెస్ట్ వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.