NEWSTELANGANA

హ‌ర్యానాకు అంద‌లం తెలంగాణ‌కు మంగ‌ళం

Share it with your family & friends

ఏక‌ల‌వ్య మోడ‌ల్ స్కూల్స్ భ‌ర్తీలో కుంభ‌కోణం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల భ‌ర్తీ చేసిన ఏక‌ల‌వ్య మోడ‌ల్ స్కూల్స్ బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది విష‌యంలో తెలంగాణ‌కు చెందిన ఏ ఒక్క‌రినీ ఎంపిక చేయ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది కూడా ఇటీవ‌ల దేశంలో చోటు చేసుకున్న నీట్ యూజీ స్కాం లాంటిదేన‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు ఆర్ఎస్పీ.

వాస్తవానికి ప్రాంతీయ భాషలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని నూతన విద్యా విధానం చెబుతోందన్నారు. కానీ అందుకు భిన్నంగా ముందే ఫ‌లితాల‌ను సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తి కాక పోయినా ఆద‌రా బాద‌రాగా ప్ర‌క‌టించార‌ని, దీని వెనుక ఏదో జ‌రిగింద‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఈ ప్రస్తుత రిక్రూట్‌మెంట్ విధానం హిందీయేతర రాష్ట్రాల నుండి ఉద్యోగాలను ఆశించే వారికే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన విద్యార్థులకు కూడా హాని చేస్తుంద‌ని ఆవేద‌న చెందారు. ఉపాధ్యాయులు ఒకే భాషలో బోధించే స్థితిలో లేకుంటే ఈ పిల్లలు ఎప్పుడు ఇంగ్లీషు నేర్చుకుంటారని ప్ర‌శ్నించారు.

తాను తెలంగాణలో కొంత కాలం ఏకలవ్య స్కూల్స్‌కి సెక్రటరీ (ఇంఛార్జి)గా పని చేశాన‌ని తెలిపారు. అవన్నీ CBSE సిలబస్‌తో కూడిన ఆంగ్ల మాధ్యమ పాఠశాలలేన‌ని పేర్కొన్నారు. విషాదం ఏమిటంటే కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది విద్యార్థులకు ఆంగ్లంలో బోధించలేక పోతున్నారని వాపోయారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని త‌మ వారికి ప్రాధాన్య‌త ఇచ్చేలా చేస్తోంద‌ని ఆరోపించారు ఆర్ఎస్పీ. దీనిపై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.