మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి – ఆర్ఎస్పీ
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర పదజాలంపై ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ , మెజిస్ట్రేట్ ను పట్టుకుని అనరాని రీతిలో కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ స్పందించారు.
వెంటనే సుమోటోగా తీసుకుని నోరు జారిన జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కోరారు. ఒక మహిళను పట్టుకుని అలా ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు.
బహిరంగ వేదికపై ఐఏఎస్ ఆఫీసర్ ను పట్టుకుని అనేందుకు మనసు ఎలా వచ్చిందంటూ నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జిల్లా కలెక్టర్ ను బూతులు తిడుతుంటే ఇక ప్రజలకు అధికారుల మీద ఎలా గౌరవం ఉంటుందని పేర్కొన్నారు .
జగ్గా రెడ్డికి వెంటనే నోటీసులు ఇచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పమని ఆదేశించండి. లేక పోతే మీ మహిళా కమిషన్ ను కూడా నమ్మరని పేర్కొన్నారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తయారైందని ఆరోపించారు.