రమ్మని పిలిచి గృహ నిర్బంధం చేస్తారా..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఇటు తెలంగాణ అటు ఏపీలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు.
కానీ సోమవారం తనకు పోలీసు అమరులకు నివాళులు అర్పించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్బంగా హైదరాబాద్ లో జరిగే పరేడ్ కు రావాలని ఆహ్వానించారని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కానీ తనను రాత్రి నుండే గృహ నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత కూడా నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా?? అని ప్రశ్నించారు ఆర్ఎస్పీ.
సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నాళ్లీ అరాచకాలు అంటూ మండిపడ్డారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని పేర్కొన్నారు.