గురుకుల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ – ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యా సంవత్సరం మధ్యలో సీనియర్ ఫ్యాకల్టీలను మార్చొద్దు, మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు అంటూ హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు.
గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు. వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన విద్యా శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే పెట్టుకున్నా ఇప్పటి వరకు దిద్దుబాటు చర్యలు చేపట్ట లేదని ఆరోపించారు.
సీఎం నిర్వాకం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఉన్నట్టుండి 6200 మందిని అకారణంగా తీసి వేశారని , ఇలాగే చేస్తూ పోతే చివరకు పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి గుండ్లకట్ల జగదీశ్వర్ రెడ్డి.