గువ్వల..బీరంలకు రక్షణ కల్పించాలి
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ డిమాండ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆయన ప్రోత్బలంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. గురువారం మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్ష వర్దన్ రెడ్డితో కలిసి డీజీపీ రవి గుప్తాను కలిశారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం దారుణమన్నారు. వెంటనే గువ్వల బాలరాజు, బీరం హార్షవర్ధన్ రెడ్డిలకు గన్ మెన్ లను కేటాయించాలని కోరారు. వారి ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. దాడులకు పాల్పడిన నిందితులపై పిడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట,కొల్లాపూర్,నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో కాంగ్రెస్ గుండాలు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై మరణాయుధాలతో దాడి చేసి, తీవ్రంగా గాయరిచిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ గుండాలు మరణాయుధాలతో దాడి చేసి, హత్యాయత్నం చేశారని, ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
వంగూరులో పోలింగ్ రోజు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు.