NEWSTELANGANA

బీఎస్పీని వీడిన ఆర్ఎస్పీ

Share it with your family & friends

గులాబీ గూటికి మాజీ ఐపీఎస్

హైద‌రాబాద్ – బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి నిన్న‌టి దాకా అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను చీఫ్ ప‌ద‌వి నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను బీఎస్పీ జాతీయ అధ్య‌క్షురాలు కుమారి మాయావ‌తికి పంపించిన‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు కుదిరింద‌ని, హైద‌రాబాద్, నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా కేటాయించింద‌ని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ బీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకు వ‌చ్చింద‌ని ఆరోపించారు.

బీఆర్ఎస్ తో పొత్తు వ‌ద్ద‌ను కోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దీని కార‌ణంగానే తాను పార్టీని వీడాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను బీఎస్పీని విడిచి పెట్టినా ద‌ళిత వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ప‌ని చేస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. మొత్తంగా ఆర్ఎస్పీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. దేశంలో బీజేపీ రాజ్యాంగాన్ని లేకుండా చేయాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు.