బీఆర్ఎస్ తో పొత్తుకు మాయావతి ఓకే
ప్రకటించిన రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం కుమారి మాయావతి తీపి కబురు చెప్పారని తెలిపారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
బీఎస్పీ, బీఆర్ఎస్ ల కూటమికి సంబంధించిన చర్చలపై ఏర్పడిన సందిగ్ధానికి బీఎస్పీ చీఫ్ తెర దించారని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ. ప్రస్తుతం దేశంలోని ఏ కూటమిలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ లేనందు వల్ల ఆ పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు .
కలిసి ముందుకు సాగేందుకు తమకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా బెహన్ జీ తమకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
త్వరలోనే పొత్తు విషయంపై మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీఎస్పీ ఎంపీ, కేంద్ర పార్టీ సమన్వయకర్త శ్రీ రాంజీ మాయావతి తరపున హాజరవుతారని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ.