బహుజనులకు అన్యాయం సర్కార్ పై యుద్దం
ఆవేదన వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా బహుజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓపెన్ కాంపిటేషన్ (OC) లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీ లో బహుజనులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ ) (SC/ST/BC/Minority/EWS) ప్రవేశం లేదంటున్న కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ప్రభుత్వపు అక్రమ జీవో 29 విషయంలో ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీరు ఏ వర్గాల నుండి వచ్చారో ఆ వర్గ ప్రయోజనాల కోసం గళం ఎత్త లేనప్పుడు, వారి తరపున ప్రశ్నించనప్పుడు మీరు అధికారంలో ఉంటే ఏంది..లేకుంటే ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు ఆర్ఎస్పీ.
ఇటీవలే బీసీ ముఖ్యమంత్రి కావాలి అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న గొంతు ఎందుకు మూగ బోయిందంటూ నిలదీశారు . బాధితుల్లో బీసీ బిడ్డలు ఉన్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు .
మీ అందరికి ఏ మాత్రం ఆత్మ గౌరవం అనేది ఉన్నా సీయం రేవంత్ రెడ్డిని వెంటనే నిలదీయాలని పిలుపునిచ్చారు. మెజారిటీ వర్గాల ప్రయోజనాలను తుంగలో తొక్కి, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న టీజీపీఎస్సీ బోర్డును రీకాల్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇవన్నీ చేతకాక పోతే అందరూ రాజీనామా చేసీ అశోక్ నగర్ కు రావాలని, మన బిడ్డలకు న్యాయం చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.