Monday, April 21, 2025
HomeNEWSఆకునూరి ద‌మ్ముంటే రాజకీయాల్లోకి రా

ఆకునూరి ద‌మ్ముంటే రాజకీయాల్లోకి రా

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళిపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. అప‌ర మేధావిన‌ని, ప్ర‌శ్నించే గొంతుక‌ను, విద్యా వేత్త‌ను అంటూ ఫేక్ ప్ర‌చారం చేసుకోవ‌డం పుల్ స్టాప్ పెడితే మంచిద‌న్నారు. గురువారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ద‌మ్ముంటే రిజైన్ చేసి రాజ‌కీయాల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు.

మీకు చేతనైతే విద్యా కమిష‌న్ ఛైర్మన్ గా ప్రభుత్వానికి సలహాలు , సూచనలు ఇవ్వండి…స్వాగతిస్తామ‌ని పేర్కొన్నారు. జీవో ప్రకారం మీకు నెల నెలా వచ్చే లక్షల జీతం తెలంగాణ ప్రజల కష్టార్జితం అన్న విషయం మరచి పోవ‌ద్ద‌ని సూచించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. మీ ప్రస్తుత పోస్టు రాజకీయాలకు అతీతం అన్న చిన్న విషయం కూడా మీకు అర్థం కాకపోవడం మీ నిరక్షరాస్యతకు అద్దం పడుతుందన్నారు.

కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధిగా జబ్బలు చించుకొని ఎవరో కాంగ్రెస్ పోకిరి గాళ్లు గంజాయి మత్తులో ఎడిట్ చేసిన వీడియోలు షేర్ చేసే గలీజు పనిలో బిజీగా ఉండ‌డం అత్యంత జుగుస్సాక‌ర‌మ‌ని పేర్కొన్నారు . తెలంగాణ లో పిల్లల ప్రాణాలు పిట్టల లాగా రాలి పోతుంటే ఎందుకు మూగబోయింది మీ ప్రశ్నించే గొంతుక అంటూ నిల‌దీశారు.

మీ లాంటి మతి లేని మేతావులు కాంగ్రెస్ చుట్టూ మోపైనందు వల్లనే మా బిడ్డల భవిష్యత్తు ఈ రోజు బజారున పడ్డదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీరు చివర్లో ఐఏఎస్ ఎట్లయిండ్రో తెలంగాణ సమాజానికి చెప్పే కుసంస్కారిని తాను కాద‌న్నారు.

14 సంవత్సరాల వీరోచిత పోరాటం చేసి, కాంగ్రెస్ వెన్నుపోట్లను ఎదుర్కొని, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి, రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్, కేటీఆర్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు.

ధమ్ముంటే కండువా ఏసుకోని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు. లేక పోతే నోరు, సెల్ఫోను రెండూ మూసుకొని ఇంట్లో కూర్చో భయ్యా అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments