నేను గొర్రెను కాను..కాలేను
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన బీఎస్పీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుండడంతో తీవ్రంగా స్పందించారు. శనివారం ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన వాళ్లు ఇలా కేసీఆర్ ను ఒంటరిగా ఎలా వదిలి వెళతారంటూ ప్రశ్నించారు ఆర్ఎస్పీ.
చాలా మంది తన అభిమానులు, అనుచరులు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, వారందరూ ఎలాంటి ఉత్కంఠకు లోను కావద్దని సూచించారు. భవిష్యత్తు మనదే అవుతుందన్నారు. ఒకరు లేదా ఇద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఏమీ కాదన్నారు.
పార్టీ జనరల్ సెక్రటరీ , రాజ్య సభ సభ్యుడు కే కేశవరావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి , కడియం కావ్య పార్టీని వీడడాన్ని తప్పు పట్టారు. కేసీఆర్ బాగానే చూసుకున్నాడని , పదవులు కట్టబెట్టాడని కానీ ఉన్నట్టుండి గుడ్ బై చెబితే ఎలా అని మండిపడ్డారు ఆర్ఎస్పీ.
ఈ సందర్బంగా సంచలన కామెంట్స్ చేశారు. తాను గొర్రెను కానని కాలేనని స్పష్టం చేశారు. తాను వీలైతే సింహం కావాలని అనుకుంటానని ఒకరి చేతిలో బలై పోయే సామాన్యుడిని కానని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదన్నారు.