తెలంగాణ సర్కార్ పై ఆర్ఎస్పీ పైర్
మహా ధర్నాకు పర్మిషన్ నిరాకరణ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పూర్తిగా అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరబట్టిన కొడంగల్ లగచర్ల గిరిజన బిడ్డలకు సంఘీభావంగా ఇవాళ మానుకోటలో జరగాల్సిన శాంతియుత మహా ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. అంతేకాకుండా 144 సెక్షన్ విధించడం పట్ల మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కనిపిస్తే కాల్చివేతకు కూడా వెనకాడరన్న మాట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు శ్రీలంకలో రాజపక్ష సోదరులు, బంగ్లాదేశ్ లో హసీనా, టునీషియాలో బెన్ అలీ, ఈజిప్ట్ లో హోస్నీ ముబారక్ లు కూడా ఈ విధంగా నే విర్రవీగారని గుర్తు చేశారు. ఆ తర్వాత వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు ఆర్ఎస్పీ.
డోర్నకల్ కాంగ్రేసు ఎమ్మెల్యే ఒక గిరిజనుడై ఉండి కూడా సాటి గిరిజనుల భూములను ‘తన అల్లుడి కళ్లలో ఆనందం’ కోసం సీఎం కబ్జా చేస్తుంటే, ఆయనకే వంతపాడడం నిజంగా సిగ్గుచేటు అన్నారు. సేవాలాల్ మహారాజ్ ప్రవచించిన “ఏక్ జాత్, ఏక్ సాత్, ఏక్ వాత్” ను అప్పుడే మరచిపోయారా అని ప్రశ్‌నించారు.
ఆ లగచర్ల జ్యోతి, సుశీల, కిష్టు బాయిలకు (చెల్లెలకు) ఉన్న తెగువ, ఆత్మగౌరవం లో కనీసం ఇసుమంతైనా ఈ లీడర్లకుంటే చాలా బాగుంటుండె అని అన్నారు. గిరిజనుల భూమి హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న కేటీఆర్ మీద రాళ్ల దాడి చేస్తామని ప్రకటించడం దేనిని సూచిస్తోందని అన్నారు.