బీజేపీకి బుద్ది చెప్పాలి – ఆర్ఎస్పీ
బహుజనులకు రిజర్వేషన్లు రద్దు
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. శుక్రవారం ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని హెచ్చరించారు.
ఆ పార్టీ ఏకంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు, బీసీలకు చెందిన రిజర్వేషన్ల సౌకర్యాన్ని రద్దు చేస్తానంటూ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారని ఇంతకంటే బానిసత్వం ఇంకేముంటుందని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బహుజనులంతా మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. లేకపోతే తిరిగి మళ్లీ మనందరం బానిసత్వంలోకి వెళ్లి పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా, ధైర్యం ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు బీఆర్ఎస్ నేత. ఓటు అత్యంత విలువైనదని, దానిని ఆలోచించి వేయాలని ఆయన కోరారు.