రామ రాజ్యంతో పేరుతో రాజకీయం
జన్వాడ ఘటన కారంచేడు లాంటిదే
గద్వాల జిల్లా – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ పై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలన్నీ ఇవాళ ప్రజల మధ్య లేనిపోని ఘర్షణలు సృష్టించేలా చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని ఆవేదన చెందారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జన్వాడలో క్రైస్తవులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సోమవారం ఈ దాడి ఘటనను నిరసిస్తూ గద్వాలలో వాయిస్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జన్వాడలో పథకం ప్రకారం ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత మతోన్మాదులు క్రైస్తవులపై పాశవికంగా దాడులు జరిపారని ఆరోపించారు. ఈ ఘటన ఆనాడు చోటు చేసుకున్న ఘటనలు చుండూరు, కారంచేడు తో పోల్చారు ఆర్ఎస్పీ.
దేశంలో రామరాజ్యం పేరుతో మతోన్మాద గుండాలు క్రైస్తవులపై దాడులకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధ మన్నారు. రాజ్యాంగంలో అధికరణ- 25 ప్రకారం అందరు పౌరులకు మత స్వేచ్చ ఉందన్నారు ఆర్ఎస్పీ. ప్రజాస్వామ్య, లౌకిక దేశంలో మత స్వేచ్చకు భంగం కల్గించడమంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమేనని పేర్కొన్నారు. .జన్వాడ నిందితులను చట్టప్రకారం శిక్షించి, మత మైనారిటీలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.