NEWSTELANGANA

జీవో నెంబ‌ర్ 46 బాధితుల‌పై క‌క్ష‌

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ ఫైర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ సర్కార్ పై మండిప‌డ్డారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. గ‌త కొంత కాలంగా జీవో నెంబ‌ర్ 46 బాధితుల స‌మ‌స్య కొన‌సాగుతోంద‌ని తెలిపారు. దీనిని ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన సీఎం ఎందుకు దానిపై ఫోక‌స్ పెట్ట‌డం లేదంటూ ప్ర‌శ్నించారు ఆర్ఎస్పీ.

జీవో నెంబ‌ర్ 46ను స్పెషల్ పోలీసు బలగాలకు వర్తింప జేసే విషయంలో ఏర్పాటు చేసిన‌ కమిటీ ఎన్ని సార్లు కలిసింది? దాని రిపోర్టు ఏమైంది అంటూ నిల‌దీశారు. తెలంగాణ స్పెషల్ పోలీసు నియామకాల్లో దాదాపు 700 మంది శిక్షణకు రిపోర్టు చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు.. జీవో 46 బాధితులను ఆ ఖాళీల్లో భ‌ర్తీ చేయమని కోరినా ఎందుకు స్పందించ‌డం లేదంటూ మండిప‌డ్డారు రేవంత్ రెడ్డిపై.

ఒన్ టైం ఎగ్జెంప్షన్ కింద సూపర్ న్యూమరరీ పోస్టులను విడుదల చేయడానికి మీకేమైనా అడ్డొస్తుందా? గతంలో ప్రభుత్వాలు కూడా ఇలాంటి పరిష్కారాలను చూపించారు కదా అని నిల‌దీశారు.

కోర్టుకు పోయిన బాధితులపై ఎలాంటి కనికరం చూపించకుండా అడ్వొకేట్ జనరల్ ను వాదనలకు పంపించకుండా కావాలనే మీరు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఆర్ఎస్పీ. నిరుద్యోగుల‌తో ఆట‌లాడుకుంటున్న మీకు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.