పంతుళ్ల సమస్యలపై మౌనమేల..?
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోందని రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కునారిల్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో పవర్ లోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయని , వాటి భర్తీ గురించి జాడ లేదన్నారు. ఇక రాష్ట్రంలో టీచర్ల కు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు ఆర్ఎస్పీ.
పంతుళ్ల పదోన్నతులు, బదిలీలపై ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. చీటికి మాటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని , దీని వల్ల విలువైన సమయం పోతుందన్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించక పోతే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని వాపోయారు .
ప్రశ్నించే గొంతుకలం అంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళ ఆచూకీ ఎక్కడ ఉందని అన్నారు? ఆ గొంతులు ఇప్పుడు ఎందుకు మూగ బోయాయని మండిపడ్డారు. తక్షణమే సీఎం స్పందించాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.