కాంగ్రెస్ మోసం నిరుద్యోగులకు శాపం
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. పాలన గాడి తప్పిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆవేదన చెందారు. ఓ వైపు నిరుద్యోగులు డీఎస్సీని వాయిదా వేయాలని కోరినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
మరో వైపు పోలీసులతో దాడులు చేయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. సోయి లేకుండా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
ఎన్నికల సందర్బంగా 2 లక్షల జాబ్స్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మాట మాత్రమైనా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే చివరకు ఏమవుతుందో సీఎంకు తెలుసన్నారు.
పెట్టుబడిదారులపై ఉన్నంత శ్రద్ద ఎందుకు తెలంగాణ నిరుద్యోగులపై లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిరుద్యోగుల న్యాయ పరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.