NEWSTELANGANA

నిరుద్యోగుల‌పై దాడులు త‌గ‌దు – ఆర్ఎస్పీ

Share it with your family & friends

కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం

హైద‌రాబాద్ – ఓపెన్ కేటగిరీ లో దళిత , గిరిజన , బడుగు వర్గాల కు ప్రవేశం లేదంటూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక GO 29 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. అణచివేయబడ్డ వర్గాలకు చెందిన నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్( SLP) ను వెంటనే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మోహిత్ రావు తదితరులు వచ్చే సోమవారం వాదించనున్నారు.

ఇంత జరుగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న నిరుద్యోగులను అశోక్ నగర్ లో అరెస్ట్ చేయడం, కరెంటు కట్ చేయడం, యుద్ద వాతావరణం సృష్టించడం ఏ మాత్రం సరికాదన్నారు. పేద అభ్యర్థులను సోమరులు, పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాంగీయుల రౌడీ సంస్కృతి కి నిదర్శనమ‌న్నారు.

అందుకే అర్జంటుగా జీవో 29 ను రద్దు చేసి, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులను రిలీజ్ చేసి గ్రూప్-1 ను రీషెడ్యూల్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే ఎవరికీ నష్టం జరగదని, ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడవ‌ద్ద‌ని కోరారు.

ప్రభుత్వం అన్నాక తొందరలో తప్పులు జరగొచ్చు. కాని జరిగిన తప్పును సరిదిద్ది, బాధ్యుల మీద చర్యలు తీసుకొని, ముందుకు నడిస్తే అందరికీ మంచిది కదా అని హిత‌వు ప‌లికారు.