గాడి తప్పిన గురుకులాలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన
హైదరాబాద్ – రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాజాగా గురుకుల సంక్షేమ హాస్టల్ లో కేర్ టేకర్, వార్డెన్ కలిసి బీర్లు తాగడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం కలకలం రేపింది. ఏకంగా విద్యార్థినులు భయంతో బయటకు వచ్చారు. వారిద్దరి బండారాన్ని, బీర్ల వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అనంతరం తమకు న్యాయం చేయాలని, వెంటనే హాస్టల్ వార్డెన్ , కేర్ టేకర్ ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాము పిల్లలకు కావాల్సింది బీర్లు, బిర్యానీలు కాదని మెరుగైన వసతి సౌకర్యాలతో కూడిన విద్యను అందించాలని కోరామన్నారు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా విద్యా రంగంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి సోయి అన్నది ఉందా అని ప్రశ్నించారు. తాను గురుకులాల సెక్రటరీగా ఉన్న సమయంలో మెరుగైన ఫలితాలను తీసుకు వచ్చేలా చేశానని, ఇవాళ గురుకులాలు సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోయారు.