గ్యారెంటీలు సరే అమలు ఎక్కడ..?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్
వనపర్తి జిల్లా – ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టింది పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లాలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కార్మికులు, కర్షకులు, హమాలీలతో సంభాషించారు.
మార్నింగ్ వాక్ చేపట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీహరి కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల జాబ్స్ ఇస్తామని హామీ గుప్పించారని కానీ ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు.
ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలోకి ఎలాగైనా చేర్చుకోవాలన్న ధ్యాస తప్పితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు ఆర్ఎస్పీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇవాళ నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు, హమాలీలకు భీమా వర్తింప చేయాలని కోరారు. వారికి భద్రత అత్యంత ముఖ్యమన్నారు ఆర్ఎస్పీ. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పారు.