పిల్లలు చని పోతుంటే పట్టించుకోరా
కాంగ్రెస్ సర్కార్ పై ఆర్ఎస్పీ ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పిల్లలు పిట్టల్లా రాలి పోతున్నారని కానీ వారిని కాపాడాల్సిన సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు.
పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు ఆర్ఎస్పీ. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు బలి కావడం, మరో ఇద్దరు వెంటిలేటర్ పై ఉండడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవ్వరికి పట్టనట్టు గా ఉందన్నారు. కనీసం అక్కడ డ్యూటీ నర్సులు కూడా లేక పోవడం దారుణమన్నారు ఆర్ఎస్పీ.
పేద పిల్లల ప్రాణాలకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. కేవలం హైదరాబాదులోని పబ్లిక్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ , కార్పొరేట్ పాఠశాలలలో చదువుకుంటున్న పిల్లల ప్రాణాలే ముఖ్యమా అని నిలదీశారు.
పాములు, తేళ్లు, పంది కొక్కులు రాకుండా రిపేర్లు చేయడానికి పాఠశాలలకు డార్మిటరీలకు ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.