ఫలితాలు సరే నియామకాలు ఏవీ..?
కాంగ్రెస్ సర్కార్ పై ఆర్ఎస్పీ ఫైర్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఘ మేఘాల మీద డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ (CBT) లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. చాల మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా, సీఎం రేవంత్ రెడ్డి పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీచర్ల కొరత ఉందని వెంటనే భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్త నడకన సాగిస్తున్నదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలా మంది అభ్యర్థులు నియామక పత్రాల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారని, అయినా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ నిలదీశారు .
ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేవలం వారం రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తామని, నియామకాలు చేపడతామని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సెప్టెంబర్ 5 లోపే భర్తీ చేస్తామన్న భట్టి మాటలు ఉత్త మాటలేనని తేలి పోయిందన్నారు.
వెంటనే డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం ఫైనల్ లిస్టు ప్రకటించాలని, నియామకాలు చేపట్టాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.