ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను భర్తీ చేయండి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ నాయకుడు, నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టులను భర్తీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత రెండు సంవత్సరాల కిందట మహిళా శిశు సంక్షేమ శాఖ లో గ్రేడ్ -1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి పరీక్ష నిర్వహించారని, వీటిని భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎందుకని మెరిట్ జాబితా ప్రకటించ లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చేయని నేరానికి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతోందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఏడాది లోపు 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.
రేయింబవళ్లు శ్రమించి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూడటం దారుణమన్నారు . వెంటనే సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు ఆర్ఎస్పీ. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన జాబ్స్ కాకుండా కొత్తగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు