పండుగలు సంస్కృతికి ప్రతీకలు – మోహన్ భగవత్
స్పష్టం చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్
మహారాష్ట్ర – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని నాగ్ పూర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘డీప్ స్టేట్’, ‘వోకీయిజం’, ‘కల్చరల్ మార్క్సిస్ట్’ వంటి పదాలు ఈ రోజుల్లో చర్చలో ఉన్నాయని అన్నారు మోహన్ భగవత్. నిజానికి, వారు అన్ని సంస్కృతీ సంప్రదాయాలకు ప్రకటిత శత్రువులు అని ఆరోపించారు. విలువలు, సంప్రదాయాలు, ధర్మం, శుభప్రదమైనదిగా పరిగణించబడే వాటిని పూర్తిగా నాశనం చేయడం ఈ సమూహం కార్యనిర్వహణలో ఒక భాగంగా ఉందని పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
ఇదిలా ఉండగా విజయ దశమి పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మోహన్ భగవత్. శక్తి స్వరూపిణి, సర్వ శుభకారిణి దుర్గా మాత ఆశీస్సులతో మీరు తలపెట్టే ప్రతీ కార్యం విజయవంతం అవ్వాలని ,దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు.
దసరాను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.