ఉక్రెయిన్ పై మిస్సైళ్ల వర్షం..విధ్వంసం
ప్రకటించిన ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ
ఉక్రెయిన్ – ఉక్రెయిన్ రాకెట్ దాడికి ప్రతీకార చర్యగా రంగంలోకి దిగింది రష్యా. ఏకంగా ఉక్రెయిన్ పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కు పైగా మిస్సైళ్లను ప్రయోగించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరించింది ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిపారు. యావత్ ప్రపంచం ఒక్కసారిగా విస్తు పోయింది రష్యా చేపట్టిన చర్యలతో.
కేవలం ఒక్క రోజులోనే భారీ ఎత్తున రాకెట్లను ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరికి లోనైంది. భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రధానంగా ఉక్రెయిన్ కు బలంగా ఉన్నటువంటి ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడింది రష్యా.
ఉక్రెయిన్ లోని వోలిన్ , రైన్ , లీవ్ , ఇవానో తదితర ప్రాంతాలలో ఏర్పాటైన విద్యుత్ కేంద్రాలపై ఈ మిస్సైళ్లను ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ కు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. అంతే కాకుండా ఉక్రెయిన్ పూర్తిగా చీకట్లోకి కూరుకు పోయింది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనట్లు ప్రకటించారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. కాగా ఈ మిస్సైళ్ల దాడుల్లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఎంత మందికి గాయాలయ్యాయనే దానిపై సమాచారం రాలేదని తెలిపారు.