నాలుగున్నర గంటల పాటు నిల్చున్నాం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేశాడని ఆరోపించారు. స్థాయికి దిగజారి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండవచ్చని, రేపు తాము రావచ్చని అలా అని అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడతారా అంటూ నిలదీశారు సబితా ఇంద్రా రెడ్డి.
సభ్య సమాజం తల దించుకునేలా మహిళా ఎమ్మెల్యేలని చూడకుండా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలకు పైగా అసెంబ్లీలో నిలిచి ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి కానీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కానీ , మంత్రులు కానీ పట్టించు కోలేదని మండిపడ్డారు.
ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు సబితా ఇంద్రా రెడ్డి.