కీలక ప్రకటన చేసిన మంత్రి యోగేశ్
ముంబై – దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించి మరాఠా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటన వెనుక అండర్ వరల్డ్ ప్రమేయం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మంత్రి యోగేశ్. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పోలీసులు విచారణ ప్రారంభించారని, నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగిందన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని చేస్తున్న కార్పెంటర్ ను కూడా విచారించడం జరిగిందని, అతడి వద్ద నుంచి ఎలాంటి సమాచారం లభించ లేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా భద్రత కల్పించిందని తెలిపారు. సెక్యూరిటీ లోపం వల్లే జరిగిందని దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పట్ల కక్ష సాధింపు ఉండదన్నారు.
ఇదిలా ఉండగా వరుసగా బాలీవుడ్ కు చెందిన నటులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ రవి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించింది. దీంతో తనకు ప్రభుత్వం భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.