రాహుల్ ను పీఎంగా ప్రకటించి ఉంటే..?
అదనంగా 30 సీట్లు వచ్చేవన్న సంజయ్ రౌత్
ముంబై – శివసేన బాల్ థాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.
ఆదివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈసారి దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గనుక రాహుల్ గాంధీని ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉండి ఉంటే తమకు అదనంగా 30 లేదా 35 సీట్లు వచ్చేవని అన్నారు.
ప్రస్తుతం సంజయ్ రౌత్ చేసిన కీలక వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో పెను సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చాయి. కేవలం కొద్దిపాటి తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది ఇండియా కూటమి.
కానీ తాము ముందస్తుగా పీఎం అభ్యర్థిత్వం విషయంలో ఉమ్మడి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తమకు డ్యామేజ్ జరిగిందని తాము భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్.