ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్న సిట్
అమరావతి – ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుంది ఏపీ సిట్. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన తనను ఆరో నిందితుడిగా చేర్చింది. ఇవాళ విజయవాడ సిట్ కోర్టులో హాజరుపర్చనుంది. ఈ కేసులో ఏ6గా ఉన్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్నట్లు గుర్తించింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెలనెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, విజయ సాయిరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం మారడంతో కూటమి సర్కార్ ఏపీ లిక్కర్ స్కామ్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అసలు ఏం జరిగిందనే దానిపై నిగ్గు తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ కూపీ లాగుతోంది. ఇదిలా ఉండగా నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చెందిన డిస్టిలరీలో ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున జే బ్రాండ్లు ఉత్పత్తి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనే కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది సిట్. ఈ మేరకు మాటు వేసి తనను అదుపులోకి తీసుకుంది.