మాజీ మంత్రి సాకే శైలజా నాథ్
అమరావతి – ఏపీపీసీసీ మాజీ చీఫ్ సాకె శైలజానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. రాజకీయాలలో పదవులు రావడం పోవడం సహజమన్నారు. ఏపీలో అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్నాయని వాపోయారు. చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడని, మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచాడని ఆరోపించారు. ఆయనకు విలువలు అనేవి లేవని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసేందుకు సిద్దంగా ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
సాకె శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇటీవల వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో విద్యా శాఖ మంత్రిగా కూడా పని చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీని ఏపీలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర దెబ్బ, ఏపీని రెండుగా విభజించడంతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.
ప్రస్తుతం వైఎస్ షర్మిల పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఆమె ఒంటెద్దు పోకడ పోతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే కొందరు నేతలు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. తాజాగా శైలజానాథ్ చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.