హర్యానాలో మార్పు ఖాయం – సంజయ్ సింగ్
బీజేపీకి మంగళం ఆప్ కు అందలం
హర్యానా – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఆజాద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని చర్కీ దాదీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు ఎంపీ. ఈ సందర్బంగా హర్యానాలో ఆప్ గాలి వీస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
భారతీయ జనతా పార్టీ, ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎన్ని కుట్రలు పన్నినా వర్కవుట్ కాదన్నారు సంజయ్ ఆజాద్ సింగ్. తమ ప్రభుత్వం ఢిల్లీలో తొలుత మార్పు తీసుకు వచ్చిందని, అదే మార్పు పంజాబ్ లో కొనసాగుతోందని చెప్పారు.
ఇదే మార్పు హర్యానా రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోష్యం చెప్పారు సంజయ్ ఆజాద్ సింగ్. తాము అధికారంలోకి రావడం తప్పదని, వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
ఆప్ అధినేత , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట ఇవ్వరని, ఇస్తే తప్పరని ఆ విషయం ఇప్పటికే రూఢీ అయ్యిందని అన్నారు సంజయ్ ఆజాద్ సింగ్. హర్యానాలో ఇప్పటి వరకు బీజేపీ దుష్ట పాలన సాగిందని ఆరోపించారు. కానీ ప్రజలు దానికి మంగళం పాడేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.