గూండాలు..నేరగాళ్లకు బీజేపీ అడ్డా
ఢిల్లీలో మోదీ ఆటలు చెల్లుబాటు కావు
న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ఈ దేశంలో అత్యంత నేర పూరితమైన వ్యక్తులు, మాఫియా డాన్లు, అక్రమార్కులు, అవినీతి పరులు, దోపిడీదారులకు అడ్డాగా భారతీయ జనతా పార్టీ కేంద్రంగా మారి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీలో ఆప్ ఆధ్వర్యంలో సీఎం కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ లను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సంజయ్ సింగ్ ప్రసంగించారు.
జైళ్లు, కేసులు, అరెస్ట్ లు తమకు కొత్త కాదని ప్రకటించారు. ఆనాడు గాంధీ, భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ , నెహ్రూ అంతా జైలుకు వెళ్లిన వారేనని గుర్తు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గత్యంతరం లేక న్యాయ స్థానం జోలికి మోదీ వెళ్లడం లేదన్నారు.
ఈ సందర్బంగా ప్రత్యేకంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ గురించి ప్రస్తావించారు. ఆయన ఇచ్చిన సంచలన తీర్పుతో ఇవాళ బీజేపీ బండారం బయట పడిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో ఏకంగా రూ. 6,000 కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించారు.