కేంద్రం ఒత్తిడి వల్లే ఆనంద్ రాజీనామా
నిప్పులు చెరిగిన ఎంపీ సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆప్ తలకిందులు అవుతోంది. ప్రధానమైన పార్టీకి చెందిన నేతలు జైలు పాలయ్యారు. ఒకే ఒక్కడు ఇప్పుడు ఆప్ కు దిక్కుగా మారారు. ఊహించని రీతిలో ఆప్ కు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీగా ఆప్ కు పేరుందని, కానీ రాను రాను ఆ పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంపై స్పందించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ . ఆయన ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. మీడియాతో మాట్లాడారు మరో మంత్రితో కలిసి. కేంద్రం ఒత్తిడి మేరకు ఈడీ రంగంలోకి దిగిందని, ఆనంద్ ను భయభ్రాంతులకు గురి చేసిందని ఆరోపించారు. తాము ఆయన పట్ల వ్యతిరేకంగా కామెంట్ చేయదల్చు కోలేదన్నారు సంజయ్ సింగ్.
జైల్లో పెడుతుందని భయాందోళనకు గురయ్యాడని, అయినా ఎవరు ఉన్నా లేక పోయినా ఆమ్ ఆద్మీ పార్టీ బతికే ఉంటుందన్నారు ఎంపీ. తాను కొంచెం యాక్టివ్ గా ఉంటే ఈడీ తనపై ఫోకస్ పెడుతుందని గతంలో తనతో పంచుకున్నాడని తెలిపారు. పటేల్ నగర్ రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని, ఈ తరుణంలో బీజేపీ ఓడి పోవడం ఖాయమని ఇది తెలిసే తనపై ఒత్తిడి తీసుకు వచ్చేలా చేసిందన్నారు సంజయ్ సింగ్.