ప్రధానిపై కేసు ఎందుకు పెట్టరు
ప్రశ్నించిన ఎంపీ సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆయన ఓ జాతీయ మీడియా (ఆజ్ తక్ ) ఛానల్ తో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో కొలువు తీరిన తర్వాత దారుణాలు చోటు చేసుకున్నాయని, బహుజనులపై దాడులు పెరిగి పోయాయని, పెత్తందారీ తనం పెచ్చరిల్లి పోతోందని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ సింగ్.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా స్పష్టం చేశారు. మణిపూర్ లో ఓ సైనికుడి భార్యను నగ్నంగా ఊరేగించారని కానీ అక్కడున్న సీఎం స్పందించ లేదని, ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు .
హోం శాఖ సహాయ మంత్రి కొడుకు నలుగురు రైతులను జీపుతో తొక్కించి చంపినా రాజీనామా చేయలేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తున్న సీఎంను చెరసాలలోకి నెట్టి వేయడం దారుణమన్నారు.
ఇన్ని దారుణాలకు ప్రధాన బాధ్యత వహించాల్సింది పీఎం మోదీయేనని , ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని నిప్పులు చెరిగారు సంజయ్ సింగ్.