ఎంపీ సంజయ్ సింగ్ కామెంట్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ లలో కొలువు తీరిన ఆప్ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తప్పుడు కేసులు ఇరికించారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా , పార్టీ చీఫ్ జేపీ నడ్డా త్రయం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు.
వారి ఆలోచనంతా ఆప్ ను నామ రూపాలు లేకుండా చేయాలని అన్నారు సంజయ్ సింగ్. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గనుక రాజీనామా చేస్తే వీరు గంప గుత్తగా ఆప్ ను లేకుండా చేస్తారని ఆరోపించారు. మా మంత్రులను జైల్లో పెడతారని , ఆ తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , మంత్రులను చెరసాల్లోకి తోస్తారని ధ్వజమెత్తారు సంజయ్ సింగ్.
అందుకే బీజేపీ నేతలు పదే పదే రాజీనామా చేయాలని కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ , బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లను జైల్లో ఉంచాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు.