ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.