ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు
నిప్పులు చెరిగిన సత్య కుమార్ యాదవ్
విశాఖపట్నం – ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. గతంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ నిర్వాకం కారణంగా ఇవాళ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వ నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విశాఖపట్నంలో అడుగు పెట్టారు.
ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ప్రదర్శనలో మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా పాల్గొన్నారు.
తన పట్ల మీరంతా చూపించిన ప్రేమను తాను ఎన్నటికీ మరువ లేనని అన్నారు సత్య కుమార్ యాదవ్. రాష్ట్రంలో కూటమికి బంపర్ మెజారిటీ ఇచ్చినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. ఆరోగ్య శాఖ అనారోగ్యం పాలైందని ఆవేదన చెందారు. విద్యా శాఖ రాజకీయ వేదికగా మారిందంటూ మండిపడ్డారు. విద్యుత్‌శాఖ అప్పుల కుప్పగా మారిందన్నారు. పారిశ్రామికవాడల్ని స్మశానం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సత్య కుమార్ యాదవ్. ప్రస్తుతం రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు.