మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలి
పిలుపునిచ్చిన మంత్రి సత్య కుమార్
అమరావతి – సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న మత్తు పదార్థాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్. శనివారం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ఈ సందర్బంగా భారీ ఎత్తున యువతీ యువకులు తరలి వచ్చారు.
భారీ ర్యాలీని ఉద్దేశించి సత్య కుమార్ యాదవ్ ప్రసంగించారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్, మత్తు విముక్త ఏపీ, డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మాణం కోసం నడుం బిగించిన ఇస్కాన్ సంస్థను అభినందిస్తున్నట్లు చెప్పారు. .
యువతతో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువత లేకుంటే సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. యువత సరైన మార్గంలో వెళితే కుటుంబానికి, సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. కొంత మంది యువత మత్తు పదార్థాల బారిన పడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అందరూ సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే డ్రగ్స్‌ను అరికట్టగలమన్నారు. డ్రగ్స్ వినియోగం, అమ్మకం గురించి తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.