పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలి
ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి – ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి లోని సాయి ఆరామంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితతో కలిసి పాల్గొన్నారు. జిల్లా సర్వతోముఖావృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
ఈ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నప్పటికీ దశాబ్దాలుగా వెనబడిన ప్రాంతంగా సత్యసాయి జిల్లా ఉండి పోవడం బాధాకరమన్నారు. సత్యసాయి ట్రస్ట్, దార్శనికత, పరిణతి కలిగిన కొందరు నాయకుల వల్ల కొంత అభివృద్ధి చెందినప్పటికీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇప్పటికీ వెనకబడే ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.
కేంద్రం పథకాలు, గ్రాంట్స్‌ను సమర్థంగా ఉపయోగించు కోవడం, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడడంలో అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. ప్రజల అవసరాలు, ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా పని చేయాలని అన్నారు.
కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో విస్తారంగా ఉన్న కనెక్టివిటీ, భూములను ఉపయోగించుకొని పరిశ్రమలు తీసుకు వచ్చేలా తద్వారా ఉపాధి కల్పించేలా పని చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా అభివృద్ధి విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.