ఆర్టీసీ సేవలు ప్రశంసనీయం
మంత్రి సత్య కుమార్ యాదవ్
అనంతపురం జిల్లా – రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న సేవలు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్. బుధవారం ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణం నుంచి నేరుగా తమిళనాడు రాజధాని చెన్నైకి నూతనంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు. గత కొన్నేళ్లుగా ధర్మవరం వ్యాపారానికి కేంద్రంగా ఉంటూ వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి అటు బెంగళూరు ఇటు చెన్నై, ముంబై, విజయవాడ , హైదరాబాద్ , ఢిల్లీ ప్రాంతాలకు నిత్యం వ్యాపారులు రాక పోకలు సాగిస్తున్నారని చెప్పారు.
ఇక పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్లాలంటే ఇతర మార్గాల ద్వారా చెన్నైకి వెళ్లాల్సి వచ్చేదన్నారు. దీనిని గమనించిన ఆర్టీసీ కొత్త సర్వీసును ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
ఈ నూతన బస్సు సర్వీస్ ధర్మవరం నుంచి బయలు దేరి పుట్టపర్తి, కదిరి, మదనపల్లె, తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించిందని తెలిపారు.
ధర్మవరం నుంచి చెన్నై వెళ్లే వ్యాపారస్థులకు, కార్గో సర్వీసులకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.. అలాగే తిరుపతి, చెన్నైలో చదువుకునే వాళ్లకు, ఉద్యోగం చేసుకునే వాళ్లకూ ఉపయోగపడుతుందని చెప్పారు సత్య కుమార్ యాదవ్.