మరాఠాలో కమల వికాసం తథ్యం
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
మహారాష్ట్ర – మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి కొలువు తీరడం తథ్యమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. శనివారం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా కమలం గాలి వీస్తోందన్నారు. విపక్షాల కూటమికి అంత సీన్ లేదన్నారు. దేశంలో అభివృద్ది అన్నది పరుగులు పెడుతోందని, సమర్థవంతమైన నాయకత్వం కలిగిన మోడీ సారథ్యంలో అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందని చెప్పారు సత్య కుమార్ యాదవ్.
కొందరు కావాలని మనుషుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయినా ఇండియా కూటమి నేతలను ,ఆ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని, నైపుణ్యం, దమ్మున్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించే దిశగా కేంద్ర సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. ఇక మరాఠాలో కొలువు తీరిన శివసేన, బీజేపీ సంకీర్ణ సర్కార్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు.